.కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కొత్తపల్లికి చెందిన భూమి విషయంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడ్డ కేసులో నిందితుడిగా ఉన్న నందెల్లి మహిపాల్ ఫిబ్రవరి 20 వ తేదీన అరెస్టు కాబడి జైల్లో ఉన్న విషయం విధితమే. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ కొరకై కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు గురువారం నాడు ఉదయం 10:30 గంటల నుండి, శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు కోర్టు ద్వారా 24 గంటల పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు.
నిందితుడిగా ఉన్న నందెల్లి మహిపాల్ నుండి కీలక సమాచారం సేకరించేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ఏకకాలంలో నాలుగు చోట్ల అతనితోపాటు అతడి సహాచరులకు చెందిన జ్యోతి నగర్, శర్మ నగర్, ముకరాంపురలలోని మూడు ఇల్లు ఒక ఆఫీసులో సోదాలు నిర్వహించి, దాదాపు 6 గంటలు శ్రమించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనపరచుకున్నారు. ఇట్టి కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.