నిఘా న్యూస్ , కాకినాడ: ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తన చేరికపై ఆయన తన స్వగ్రామమైన కిర్లంపూడి నుండి ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జగన్ పిలుపుమేరకు వైకాపాలో చేరుతున్నానని, దానికి మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు. మరలా ముఖ్యమంత్రి పీఠంపై జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ అందరి సహకారంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వారి ద్వారా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని చేయించాలని ఆశిస్తూన్నానన్నారు. మీ బిడ్డను అయినా నేను ఎప్పుడూ తప్పు చేయలేదని,ఇకపై చేయను కూడా అని హామీ ఇచ్చారు. ఈనెల 14న వైకాపాలో చేరేందుకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి బయలుదేరి ప్రతిపాడు, జగ్గంపేట, లాలాచెరువు, వేమగిరి,రావులపాలెం, తణుకు,తాడేపల్లిగూడెం, ఏలూరు,విజయవాడ మీదుగా తాడేపల్లి వెళ్లనున్నట్టు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు.
