కరీంనగర్, నిఘా న్యూస్: జర్నలిస్టు హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు సంక్షేమ సంఘంకు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడిగా మానసాని కృష్ణారెడ్డిని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ (నిఘా శ్రీను) అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణారెడ్డి గతంలో పలు జర్నలిస్టు సంఘాల్లో చురుకుగా పనిచేసి విశేష అనుభవం సంపాదించారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సాధన, మీడియా వేతన సమస్యల పరిష్కారంలో ఆయన అనుభవం సంఘానికి ఉపయోగపడుతుందని నిఘా శ్రీను విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించి, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కృష్ణారెడ్డి సమర్థంగా నిర్వహిస్తారని తెలిపారు.
నూతన బాధ్యతల స్వీకరణపై కృష్ణారెడ్డి స్పందిస్తూ, తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తానని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ నియామకం ద్వారా సంఘం మరింత బలోపేతమవుతుందని, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


