- లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు
- గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు
- విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్!
- లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని భువనగిరి సమీక్షలో స్పష్టీకరణ
హైదరాబాద్, (నిఘాన్యూస్): రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని కలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలి సింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సం కేతాలు ఇచ్చినట్టు సమాచారం.
మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్లు, పాల కవర్గాల పదవీకాలం జనవరి నెలాఖరులోనే పూర్తి కాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికా రుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలు వుదీరాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సం స్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవ కాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.