సిరిసిల్ల జులై 24( నిఘా న్యూస్) రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పద్మా నగర్ కాలువ పైన నిర్మించిన ఫిల్టర్ బెడ్ పనిచేయకపోగా లక్షల రూపాయల ప్రజలదనం దుర్వినియోగం కాగా ముందు చూపు లేకుండా నిర్మించడం వలన కాల్వ ద్వారా వచ్చే మురికి నీరు ఫిల్టర్ కాకపోగా చుట్టుపక్క ఉన్న ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులను బహుమతిగా ఇస్తుంది. ఈ మురికి కాలువ తారకరామా నగర్ నుండి మొదలుకొని కొత్తచెరువు వరకు విస్తరించి ఉంది.ఈ కాలువకు ఆనుకొని ఇరువైపులా దాదాపుగా పదుల సంఖ్యలో వార్డులకు సంబంధించిన ప్రజలకు ఇబ్బందుల గురిచేస్తుంది.ఈ కాలువ ముందు భాగంలో కొత్తచెరువు దగ్గర పద్మా నగర్ వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మించడంతో అధికారుల అనాలోచన వల్ల కాలువ నుండి వచ్చే మురికి నీరు ఫిల్టర్ అడ్డంగా నిర్మించడంతో సాఫీగా వెళ్లలేక అశోక్ నగర్ అనంత నగర్ వెంకంపేట సర్దార్ నగర్ బస్టాండ్ మొదలుకొని శాంతినగర్ వరకు వరద ముప్పుకు గురవుతూ ప్రజల ఇండ్లలోకి మురికి నీరు పోయి నిత్యవసర బియ్యం వంట సామాగ్రి మునిగిపోవడమే కాకుండా డెంగు మలేరియా లాంటి వ్యాధులు సోకి దావఖానలు తిరగలేక ప్రజలు కొంపలు అమ్ముకుంటున్నాగాని అధికారులకు గానీ పాలకులకు గానీ చీమ కుట్టినట్టుగా లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన గాని గత ఐదు సంవత్సరాల నుండి ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు సందర్శించి వెళ్లినా గాని ఫిల్టర్ బెడ్ కు శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు.వర్షాకాలం వచ్చిందంటే ఆగమే గల మీద వచ్చి సందర్శించి వెళ్తారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఫలితంగా చుట్టూ పక్క ప్రజలకు ఇండ్లలోకి నీరు రావడమే కాకుండా ఫిల్టర్ బెడ్ ముందు భాగంలో దాదాపుగా 20 మీటర్ల లోతుతో 50 మీటర్ల పొడవు వరకు గుంతను నిర్మించి ముందు భాగంలో అడ్డుగా గోడ నిర్మించడంతో గత 7,8, సంవత్సరాల నుండి నీరు నిలువ ఉండడంతో దోమలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని చుట్టుపక్కల ప్రజలకు డెంగు మలేరియా లాంటి సంక్షేమ పథకాలను మాత్రం అందిస్తా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల గురించి నీరు నిల్వ ఉంచరాదు దోమలు వృద్ధి చెందుతాయని ప్రజాధనంతో ప్రకటనలు ఇచ్చే మున్సిపల్ అధికారులకు ఏళ్ల తరబడి ఇక్కడ నిలిచి ఉన్న మురికి నీరు కనబడడం లేదా ప్రకటనలు ఇస్తే పోయేది ప్రజల సొమ్మే మాదేం పోదు కదా అనుకుంటున్నారా మీరు జీతాలు తీసుకునేది ప్రజల సొమ్మని గుర్తుంచుకోవాలి. ఇకనైనా మున్సిపల్ అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని ఈ ఫిల్టర్ బెడ్ కు శాశ్వత పరిష్కారం కనుగొని వరద ముప్పు నుండి కాపాడి సీజనల్ వ్యాధులు ప్రజలకు రాకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు అశోక్ నగర్ అనంత నగర్ ప్రజలు కోరుతున్నారు ….