*సీనియర్ నేత మృత్యుంజయం అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి
*కాంగ్రెస్ అధిష్టానానికి అఖిల బ్రాహ్మణ సంఘం డిమాండ్
కరీంనగర్, నిఘా న్యూస్:రానున్న లోక సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో,బ్రాహ్మణులకు ఒక స్థానాన్ని కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించని కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బ్రాహ్మణులకే కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. బ్రాహ్మణ కుటుంబాలు మొదటినుండి కాంగ్రెస్ పార్టీకి వెన్నదన్నుగా ఉంటూ, ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు నిస్తూ వస్తున్న విషయాన్ని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కస్బా భూమేశ్వరరావు, పురం ప్రేమ్ చందర్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తూ వారికి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నాయని వారు ఆరోపించారు.బ్రాహ్మణులు ఎల్లవేళలా ఇతరుల శ్రేయస్సు కోరుకుంటారని, అలాంటి వారి పట్ల రాజకీయ పార్టీలు వివక్ష చూపడం అత్యంత బాధాకరం అన్నారు. బ్రాహ్మణులను విస్మరిస్తే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని వారు హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో ఎక్కువగా ఉన్నదని, కనుక చట్టసభల్లో వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు.
మృత్యుంజయకు టికెట్ కేటాయించాలి
ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించని కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి నుండి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సును కోరుకునే మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయంకు టికెట్ కేటాయించాలని వారు ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షునిగా, కరీంనగర్ శాసనసభ్యునిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మృత్యుంజయంకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయనను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మృత్యుంజయం ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఎదుగుదలకు ఎంతో దోహదం చేశారన్నారు. ఇలాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వల్ల బ్రాహ్మణ కులానికే కాకుండా, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే వ్యక్తిని ఎంపిక చేసిన వారు అవుతారన్నారు.కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులను విశ్వసించి, బ్రాహ్మణ జాతిని గౌరవించే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు నేదునూరి వామన్ రావు, ప్రధాన కార్యదర్శి పురం ప్రేమ్ చందర్ రావు ఉపాధ్యక్షులు జీవి రంగారావు బండపల్లి ఉపేందర్ శర్మ, యోగ మాస్టర్ సంపత్ కుమార్ డాక్టర్ దీపక్ బాబు మూగ హరిశంకర్ శర్మ నాయకులు బొమ్మన రాధాకిషన్ రావు బొప్పరాజు అశోక్ రావు .. మూగ.నాగన్న, రాజు, జీవి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.