Tuesday, August 5, 2025

బాధితులకు సత్వరమే న్యాయం జరగాలి

విజిలెన్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం

కరీంనగర్, నిఘా న్యూస్: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరు నిర్వహించారు. దీనికి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, తద్వారా నిందితులపై చర్యలు తీసుకొని బాధితుల కు అండగా నిలవాలని తెలిపారు. తప్పుడు కేసులను ప్రోత్సహించవద్దని, ఒకటికి రెండుసార్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నెలలో ఒక రోజు సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లాకు మంచి పేరు ఉందని ఈ పేరును ఇలాగే నిలబెట్టేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మాట్లాడుతూ పోలీసు అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, అట్రాసిటీ కేసులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు విచారణ చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు అంశాలను కలెక్టర్ సి పి దృష్టికి తీసుకొచ్చారు. కేసులను త్వరగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పరిహారం తొందరగా అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిడి నతానియల్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆంజనేయులు మేడి మహేష్, రవి నాయక్ , నర్సింగ్ బాబు, కరీంనగర్ టౌన్ ఏసిపి నరేందర్, కరీంనగర్ రూరల్ ఏసిపి వెంకటరమణ, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి, డిసిఆర్బి ఎస్ఐ నరేష్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు సమాచార, పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయనైనది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular