కౌంటింగ్ విజువల్స్ విడుదలలో ఆలస్యం.. అధికారుల తీరు పై ఆగ్రహం
వేములవాడ, నిఘా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. వేములవాడ మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై గంట గడిచినా, సంబంధిత ఫోటోలు మరియు వీడియోలను అధికారిక డీపీఆర్ఓ గ్రూపులో అప్లోడ్ చేయకపోవడంతో స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ విజువల్స్ అందించాలంటూ పలుమార్లు కోరినా, “సిరిసిల్ల కౌంటింగ్ వీడియోలను వాడుకోండి” అంటూ అధికారులు నిర్లక్ష్యంగా స్పందించినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కౌంటింగ్ కేంద్రం వెలుపల రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
సమాచారం సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూసినా, కనీస సహకారం అందించలేదని, ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించలేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం తగదని, వెంటనే వేములవాడ కౌంటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు అధికారిక అప్డేట్స్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



