- సేద తీరేందుకు చెట్ల నీడనే దిక్కు….!
- పని ప్రదేశంలో తల్లడిల్లుతున్న కూలీలు….
గంభీరావుపేట (నిఘా న్యూస్ )
గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో గతంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఉపాధి కూలీలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పని కూలీలు అసౌకర్యాల లేమితో ఎండలో నానా ఇబ్బందులు పడుతూ ఉపాధి పనులు చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రస్తుతం గ్రామాలకు దూరంగా ఉన్న చెరువుల్లో గుంతలు, పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి. ఎర్రటి ఎండలో కష్టపడి చెమటోడ్చి పని చేసిన వారికి కాసేపు సేద తీరడానికి సైతం అందుబాటులో నీడలేని దుస్థితి నెలకొంది.
-పని ప్రదేశంలో వసతులు కరువు
వేసవికాలం కావడంతో ఎండలు దంచికొడుతుండటంతో ఉపాధి కూలీలు పని చేసే ప్రదేశంలో మౌలిక వసతులు కరువయ్యాయి. భానుడు భగభగ మండుతుండటంతో కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఉపాధిహామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ, మంచి నీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఏమి కానరావడం లేదు. పని చేస్తున్న సమయంలో గాయాలైతే ప్రథమ చికిత్స అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్లు సైతం పని ప్రదేశంలో ఉండటం లేదు. ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయడమే మానేసింది. కనీసం తాగునీరు లేకపోవడంతో కూలీలు తమ వెంట నీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా గ్రామం నుంచి ఎక్కడో దూరంలో ఉన్న ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించి చేయిస్తుండటంతో కూలీలు ప్రతిరోజూ 3 నుంచి 5 కిలో మీటర్ల మేర నడిచి వెళ్తున్నారు.
-నీడ లేక తిప్పలు..
వేసవి కాలం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఎండవేడిలో గంటల తరబడి పనులు చేస్తున్న కూలీలు అలసటకు గురై కొంత సమయం సేద తీరుదామనుకున్నా పని ప్రదేశంలో నీడ ఉండటం లేదు. పని ప్రదేశంలో నీడ కోసం టెంట్లు వేయాల్సి ఉండగా గత కొన్నేళ్లుగా అధికారులు ఆ మాటే మర్చిపోయారు. ఉమ్మడి జిల్లాలకు ఏడేళ్ల క్రితం టెంట్లను సరఫరా చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు తిరిగి టెంట్లు అందజేసిన దాఖలాలు లేవు. గతంలో ఇచ్చిన టెంట్లు ఎప్పుడో చిరిగి పోయాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..
-అరుణ ఏపీఓ, గంభీరావుపేట

ఉపాధి పనులకు వస్తున్న కూలీలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు రావడం లేదు. స్థానిక ఏఎన్‌ఎంల వద్ద నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్లను తీసుకొని పని ప్రదేశంలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా మెడికల్ కిట్లు, ఇతరాత్ర అవసరాలకు ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతిపాదనలు పంపించాం.