కరీంనగర్ లోని కాకతీయ టెక్నో పాఠశాల తీరిది..
కరీంనగర్, నిఘా న్యూస్: ఒక విద్యార్థి ఎదుగుదల సగం బాధ్యత తల్లిదండ్రులపై ఉంటే..మరో సగం పాఠశాలలపై ఉంటుంది. కొన్ని సార్లు విద్యార్థులు ఇంట్లో కంటే పాఠశాలల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది పాఠశాలలనే అని చాలా మంది పేర్కొంటారు. కానీ కొన్ని పాఠశాలలను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారికి సరైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యం.. వాటిని పట్టించుకోవడం లేదు. కానీ ఫీజుల విషయంలో ఏమాత్రం తగ్గకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై నజర్ పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ లోని వావిలాల పల్లి లో కాకతీయ టెక్నో స్కూల్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల పేరుతో టెక్నో చేర్చినా ఇందులోని విద్యార్థులకు మాత్రం ఆ రేంజ్ లో విద్య అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా పాఠశాల విశాలమైన ప్రదేశంలో ఉండాలి. కానీ చిన్న డబ్బా కొట్టు లాంటి బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన వాతావరణం అందక అవస్థలు పడుతున్నారు. దీంతో ఒక్కోసారి వారు అనారోగ్యానికి గురైన సంఘటనలు ఉన్నాయి. అయినా యాజమాన్యం అవేమీ పట్టించుకోకుండా పాఠశాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది.
ఈ పాఠశాలలో సరైన వసతులు లేవని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి వసతులు లేకున్నా కార్పొరేట్ లెవల్లో ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ పాఠశాల సొంత భవనంలో నిర్వహిస్తున్నప్పటికీ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. సీతారాం రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జార్జి రెడ్డి ఈ ప్రైవేట్ స్కూల్ ను నడిపిస్తున్నారు.అయితే ఇప్పటికే కొందరు ఈ పాఠశాల పై విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. దీంతో విద్యాశాఖ అధికారి మధుసూదనాచారి సైతం చూసీ చూడనట్లు వదిలేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.