మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తేనే సాధ్యం
ఎవరికి వారే.. అన్నట్లుగా కొందరి ప్రవర్తన..
సమన్వయం చేసే నాయకులు ఏరి?
కరీంనగర్, నిఘా న్యూస్:ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆయా పార్టీల నాయకులు, స్వతంత్రులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీల తరుపున పోటీ చేసేవారు తమ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. స్వతంత్రులు మార్నింగ్ వాక్, తదితర కార్యక్రమాల్లో ఓటర్లను కలిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ ల తరుపున బరిలో ఉన్న అభ్యర్థుల గురించి ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గెలుసు సాధ్యమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
పట్టభద్రుల నియోజకవర్గాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ల్లో ఎంపీలుగా బీజేపీ నేతలు ఉన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆయా ఎన్నికల్లో అదే పార్టీది పై చేయి ఉంటుంది. కానీ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ ఆ సమయంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన జీవన్ రెడ్డి గెలుపొందారు. అయితే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీ అభ్యర్థి గెలుస్తారా? అని అనుకుంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఏకతాటిపైకి రావడడం కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై నిరాశ చెందుతున్నారు. అంతేకాకుండా ఈ బరిలో పోటీ చేసేందుకు కొందరు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలో నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఎంత మంది మద్దతు ఇస్తారనేది తెలియాల్సి ఉంది. నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కొంత మంది మంత్రులు, ప్రధాన నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ తరువాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాలుగు జిల్లాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నరేందర్ రెడ్డి గెలుపుకోసం కృష్టి చేయాలని చెప్పారు.
కానీ ప్రచారంలో మాత్రం ఎక్కడా కాంగ్రెస్ నాయకులు కనిపించం లేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్ కుటుంబ సభ్యులతో ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు పార్టీ నాయకులు తీవ్రంగా కృష్టి చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రచారంలో ఉత్సాహం చూపడం లేదని కొందరు అంటున్నారు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఏకతాటిపైకి వస్తేనే గెలుపు సునాయసంగా ఉంటుంది. లేకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. పార్టీ తరుపున అభ్యర్థి ఓడిపోతే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరిని సమన్వయం చేసేందుకు సరైన నాయకుడు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో పార్టీ పెద్దలు ఎటువంటి వ్యూహం పన్నుతారో చూడాలి.


