భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి : చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు
రాజన్న సిరిసిల్ల / కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 18న జరగనున్న మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అనంతరం ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, ఎండ నుంచి ఉపశమనం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


