కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి కరీంనగర్ కార్పొరేషన్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నస్రిం సుల్తానియా సయ్యద్ నయీముద్దీన్ బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇస్తున్న హామీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా తాను ముందుకు వస్తున్నానని నయీముద్దీన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ప్రత్యేక హామీని ప్రకటించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, తన డివిజన్ పరిధిలో ఆడబిడ్డ పుడితే సంబంధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తానని వెల్లడించారు. ఈ ప్రకటనకు మహిళలు, యువత నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇదే కాకుండా డివిజన్ అభివృద్ధే తన ప్రధాన అజెండా అని నయీముద్దీన్ స్పష్టం చేస్తున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రోడ్ల విస్తరణ, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇస్తున్నారు. అలాగే పారిశుధ్యంపై కఠిన చర్యలు తీసుకుని, ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతానని అంటున్నారు. మొత్తంగా 60వ డివిజన్ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నస్రిం సుల్తానియా సయ్యద్ నయీముద్దీన్ ప్రకటించడంతో, ఆయన ప్రచారం ఆసక్తికరంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


