*రంగన్నగూడెంలో ఉచిత వంటగ్యాస్ సిలెండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు…
బాపులపాడు, నిఘా న్యూస్: బాపులపాడు మండలం, రంగన్నగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి లబ్దిదారులకు ఉచిత వంటగ్యాస్ సిలెండర్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ప్రముఖులు, సీనియర్ టి.డి.పి నేత ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ…, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్-6 హామీల్లో భాగంగా తెలుగింటి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఏడాదికి 3 వంటగ్యాస్ సిలెండర్ల ఉచిత పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారని అన్నారు. దీపం-2.0 పథకం ద్వారా నాలుగు నెలలకు ఒక సిలెండరు చొప్పున ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా ఇవ్వటానికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2684 కోట్లు ఖర్చు అవుతున్నా కూడా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళటం చాలా అభినందనీయమని అన్నారు. ఒక్కో సిలెండరు ధర గరిష్టంగా రూ.876/-లు ఉండగా లబ్దిదారులకు సిలెండరు అందిన 48గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమచేయటం జరుగుతుందని చెప్పారు. మొదటి సిలెండరుకు రాయితీల కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.894కోట్లు ఇప్పటికే ఇంధన సంస్థలకు విడుదల చేశారని, రంగన్నగూడెం గ్రామ పంచాయితీ మొదటి విడతగా 1053మంది లబ్దిదారులకు రూ.9,22,428/-లు సబ్సిడీ కింద అందుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజలకు సూచించారు. 2001లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీపం 1.0 ప్రవేశపెట్టారని, మరల ఇప్పుడు దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల వచ్చే రాయితీ రూ.2,500/-లు పేద ప్రజల ఇంటి అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ పథకంలో ఒక దీపాన్ని వెలిగించటం ద్వారా మన చుట్టూ వున్న చీకట్లను పారదోలినట్లు దీపం పథకంతో ఈసారి దీపావళి పండుగ శోభ మరింత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, పంచాయితీ కార్యదర్శి ఎస్.పద్మ, ఎం.పి.సి.ఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, గ్రామ టి.డి.పి అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్, డ్వాక్రా బుక్ కీపర్ పుట్టి కృష్ణకుమారి, గ్రామ ప్రముఖులు కసుకుర్తి సత్యనారాయణరావు, కసుకుర్తి అర్జునరావు, పుసులూరు గాంధీ, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సి.హెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.