Friday, February 27, 2026

కరీంనగర్ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు..

కరీంనగర్, నిఘా న్యూస్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత అప్పటి వరకు నిరాశతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అప్పటి నుంచి కార్యకర్తలు ప్రతీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేశారు. అయితే ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటేడ్ లేదా పార్టీ పదవుల్లో అవకాశం వస్తుందని ఆశతో ముందుకు వెళ్లారు. ఇలాంటి వారిలో అల్పోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ ఇవ్వడంతో గెలవలేకపోయినా పార్టీ గాడిలో పడేందుకు తీవ్రంగా కృషి చేశారు. అంతేకాకుండా పార్టీ అధిష్టానానికి కట్టుబడి గ్రామస్థాయిలో పార్టీని తీసుకెళ్లారు. కానీ ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న “జోడు పదవులు వద్ద” అనే రూల్‌ తో కాంగ్రెస్ కార్యకర్తల్లో నిన్నటి వరకు ఆశలు రేకెత్తాయి. ఎందుకంటే ఒకరికి ఒక పదవి ఉంటేమరో పదవి వచ్చే అవకాశం ఉండదు. దీంతో మరింత మంది నాయకులు పదవుల ఆశతో ఉత్సాహంగా పనిచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టంగా ఒక వ్యక్తి ఒకే పదవి చేపట్టాలనే మార్గదర్శకాలు ఇచ్చినా… తెలంగాణ పార్టీ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కొందరు కార్యకర్తలు ఇన్నర్ గా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అవి పూర్తిగా అతిక్రమించబడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అదనంగా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై తీవ్రచర్చ సాగుతోంది.

అంతేకాకుండా జోడు పదవులపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసి.. కఠిన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకులను పూర్తిగా పక్కనబెట్టారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ… అభ్యర్థి దొరకని సమయంలో ముందుకు వచ్చి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు వంటి నాయకులను ఇప్పుడు పార్టీ విస్మరించడం సరైంది కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆయన అప్పటి పోరాటం, కఠిన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడటానికి చేసిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందకపోవడం కార్యకర్తల్లో నిరాశను పెంచుతోంది.

అంతేకాకుండా, ఇప్పటికే ఎమ్మెల్యే పదవి ఉన్న వ్యక్తికి మళ్లీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం పార్టీలో సమతుల్యతను దెబ్బతీస్తోందని స్థానిక నేతలు అంటున్నారు. ఒకే వ్యక్తి వద్ద అధికార కేంద్రీకరణ జరగడమే కాకుండా కింది స్థాయి నాయకులకు ఎదగడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ నిర్మాణం బలోపేతం కావాలంటే కష్టపడిన వారిని, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం తప్పనిసరి. అలాంటి నాయకులకు అవకాశం దక్కుంటే కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరిగి పనిచేశారు. అందులోనూ వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత బలపడేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

కానీ ప్రస్తుత నిర్ణయం మాత్రం పార్టీలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసినట్లు పార్టీ కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే, వర్గపోరు, అధికారం కేంద్రీకరణ కాకుండా, నిబద్ధత గల నాయకులను గుర్తించే సమయం ఆసన్నమైందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular