కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలు నందు మంగళవారం నాడు కమిషనరేటులోని అన్ని విభాగాల అధికారులు మరియు పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ ఓ లతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్ రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణతో పాటుగా, నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ ధికారులందరికీ పలు కీలక సూచనలు చేసారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున 05 అంతర జిల్లా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని వాటిల్లో వుండే సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలన్నారు. వారికి మౌలిక వసతులైన త్రాగునీరు, రాత్రి సమయాల్లో సిబ్బంది కనిపించేలా లైటింగ్, రోడ్డు పై వచ్చే వాహన దారులకు కనిపించేలా రిఫ్లెక్టింగ్ జాకెట్లు ధరించి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టులు పనితీరుపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బైండ్ ఓవర్ కాబడి గడువు ముగిసిన వారిని తిరిగి బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఫ్లాగ్ మార్చ్ సమయాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలను వివరించే సమావేశాల్లో ఆయా ప్రాంతాల్లో వుండే ట్రబుల్ మొంగెర్స్ ని ఉండేలా చూసుకోవాలన్నారు. పలు రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార సమావేశాల పై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ముఖ్యంగా వారి సమావేశం నిర్వహించుకునే సమయం , ర్యాలీ వెళ్లే మార్గం , ఎంతమందితో నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకొని తదనుగుణంగా ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలన్నిటిని సంబంధిత స్టేషన్ల అధికారులు స్వయంగా పరిశీలించాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలన్నారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.
కమీషనరేట్ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల వారీగా పెండింగ్ లో వున్న కేసుల వివరాలు , అందుకు గల కారణాలను తెలుసుకున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వారెంట్లను ముఖ్యంగా భౌతిక నేరాలకు సంబందించిన వాటిని అమలయ్యేలా చూడాలన్నారు.ఎన్నికల నియమావళి అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని , అధికారులందరికీ అవగాహనా కల్పించారు. ఎటువంటి ఉల్లంఘనైనాసరే సంబంధిత సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ శాంతి భద్రతలు ఏ లక్ష్మీ నారాయణ, ఏసీపీ లు నరేందర్, వెంకటరమణ, శ్రీనివాస్, శ్రీనివాస్ (ఎస్ బి ), మాధవి, విజయ్ కుమార్ లతో పాటుగా ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.