కరీంనగర్, నిఘా న్యూస్:కాలం మారుతున్న కొద్దీ విద్యావ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీని జోడించి కొత్త కొత్త పద్ధతుల ద్వారా విద్యాసంస్థలు చదువును అందిస్తున్నాయని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో చాలా మంది ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు. దీంతో కొందరు పాఠశాలల యాజమన్యాలు తమ విద్యాసంస్థలకు అదనంగా పేర్లు జోడించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. తమది ఇంటర్నేషనల్ స్కూల్, జెన్ నెక్ట్స్ స్కూల్ అంటూ ప్రగల్భాలు పలికి అందినంత తోచుకుంటున్నారు.
విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక పాఠశాలకు ఒక పేరు నిర్ణయించుకునే అవకాశం ఉంది. అయితే పాఠశాలలో అదనంగా ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తే వాటికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు అవేమీ లేకుండా పాఠశాలలో సాధారణ సౌకర్యాలున్నా తమది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. ఇంకొన్ని పాఠశాలలు తమది జెన్ నెక్ట్స్ స్కూల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ రకంగా అదనంగా పేర్లు ఉన్న పాఠశాలల్లో విద్యావిధానం బాటుంటుందని, ఇందులో చదివిన వారు భవిష్యత్ లో మంచి పొజిషన్ లో ఉంటారని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి కొందరు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో ఆ పాఠశాలల వైపు వెళ్తున్నారు. వీరిని ఆసరాగా చేసుకున్న యాజమాన్యం అందినంత దోచుకుంటున్నారు. చేసేదేమీ లేక తల్లదండ్రులు అడిగినంత డబ్బు ఇస్తున్నారు.
అయితే పాఠశాలలో జాయిన్ అయిన కొన్ని రోజుల తరువాత సాధారణ పాఠశాలల కంటే ఇందులో కొత్తేమీ లేదని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు యాక్టివిటీస్ పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం అలాంటి వాటిపై శిక్షణ ఇవ్వకపోగా పిల్లలను పెద్దగా పట్టించుకోవడం లేదని కొందరు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంపై కొందరు ముందుగానే విద్యాశాఖలోని కొందరితో ఒప్పందం చేసుకొని వారిపై ఎలాంటి మరకపడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏదో ఒకటి చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు.
ఈ క్రమంలో ఎలాంటి అదనపు సౌకర్యాలు లేని వీరు అదనంగా ఈ తోకలు ఎందుకు తగిలించుకోవడం అని ప్రశ్నిస్తున్నారు. తమ పాఠశాల స్థాయి ఏదో ఉన్నది ఉన్నట్లు మాత్రమే చెప్పాలని లేని సౌకర్యాల గురించి ఎక్కువగా ఎందుకు చెప్పుకోవాలని అంటున్నారు. ఈ తరుణంలో ఇలాంటి పాఠశాలలపై విద్యాశాఖ ఎలాటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.