పోలీసు కమీషనరేట్ కేంద్రంలో ఫ్లాగ్ డే నిర్వహణ.
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.
కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి.
కరీంనగర్, నిఘా న్యూస్: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద సోమవారంనాడు ఫ్లాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి హాజరయ్యారు. అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైనవారంతా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్బంగా దేశ రక్షణకోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను ఫ్లాగ్ డే సందర్బంగా స్మరించుకుని నివాళులు అర్పించామన్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పారా మిలిటరీ మరియు రాష్ట్ర పోలీసులు అమరులయ్యారన్నారు. వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామన్నారు. అమరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమీషనర్ మాట్లాడి వారి సేవలను కొనియాడారు. వారికి గల సమస్యలను తెలుసుకున్నారు. అట్టి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



