కాకతీయ పాఠశాలకు నోటీసులు జారీ చేసిన చేతులు దులుపుకున్న విద్యాశాఖ
ఆ తరువాత చర్యలపై నిర్లక్ష్యం..
కరీంనగర్, నిఘా న్యూస్: విద్యాబుద్దులు నేర్పి, భవిష్యత్ మార్గదర్శకాలుగా నిలవాల్సిన కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఎలాంటి పద్ధతులు పాటించకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ లోని కాకతీయ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవనే విషయాన్ని ‘కలా నిఘా’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి కాకతీయ పాఠశాలకు నోటీసులు పంపించారు. అయితే కంటితుడుపుగా నోటీసులు పంపించి చర్యలు తీసుకోవడంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాఠశాలపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ కు చెందిన కొందరు అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఉపాధ్యాయులు అటెండెన్స్ సరిగా లేదని, పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవని గుర్తించారు. ఈ మేరకు వాటిని పేర్కొంటూ పాఠశాలకు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందించారు గానీ.. ఆ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల యాజమాన్యానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నోటీసులు జారీ చేసినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు లేకున్నా తమది టెక్నో స్కూల్ అంటు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఇటువంటి పాఠశాలలపై పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా నోటీసులకు పరిమితం చేసి… ఆ తరువాత చర్యలను పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.