బ్రిడ్జిని త్వరగా ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే సత్యం
రామడుగు, మార్చి05 (నిఘా న్యూస్) :రామడుగు మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన బ్రిడ్జిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లు మంగళవారం పరిశీలించారు. గత ఐదేళ్ల క్రితం 7కోట్ల 90 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించిన బ్రిడ్జిని రెండు సంవత్సరాలలోనే పూర్తి చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఇటీవల పనులు పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి పూర్తి కావడం కోసం గత రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కూడా మేడిపల్లి సత్యం పోరాడారు. కాగా ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా చొప్పదండి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే సత్యం కలెక్టర్ పమేల సత్పతి తో కలిసి రామడుగు బ్రిడ్జిని సందర్శించారు. బ్రిడ్జి ప్రారంభానికి ఉన్న సమస్యలను తెలుసుకుని కలెక్టర్ కు వివరించి అతి త్వరగా బ్రిడ్జిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, తహశీల్దార్ భాస్కర్, ఎంపిడివో రాజేశ్వరి, ఎస్సై నేరెళ్ళ రమేష్ గౌడ్, ఏపివో రాధ, ఆర్ఐ బాలకిషన్, తదితరులు ఉన్నారు.