డబ్బులు లేకుంటే నో సర్వే
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేపడుతున్న ప్రజలు
కరీంనగర్, నిఘా న్యూస్: ఓ వైపు ఏసీబీ లంచావతారుల పని పడుతున్నా.. కొందరి తీరు మాత్రం మారడం లేదు. వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా ఆశిస్తూ ప్రజల నుంచి అధికంగా డబ్బును దోచుకుంటున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని భూముల కొలతలు నిర్వహించే సర్వే డిపార్ట్ మెంట్ లో ఓ ఉన్నతాధికారి లంచం లేనిదే భూములు సర్వే చేయడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏడీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కొందరు ఈ డిపార్ట్ మెంట్ లోని సిబ్బంది సైతం అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుపుతున్నారు.
ప్రజలు తమ భూమలను కొలతను నిర్వహించేందుకు సర్వే డిపార్ట్ మెంట్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు సిబ్బందితో సహా ఉన్నతాధికారులు లంచావతారం ఎత్తుతున్నారు. ప్రజలు నిర్ణీత రుసుమును చెల్లించి తమ భూములను సర్వే చేయించుకోవాల్సి ఉంది. కానీ తమకు ప్రత్యేకంగా అదనంగా డబ్బులు ఇవ్వనిదే సర్వే చేయమని దాట వేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా డబ్బులు ఇవ్వని వారి భూమి కొలతలను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే భూమి కొలతల కోసం ప్రజలు కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న తరువాత నెలలు గడుస్తున్నా.. తమ పనిని పూర్తి చేయడం లేదని అంటున్నారు. ఇలాంటి వీరిపై చర్యలు తీసుకోవాలని భూమి యజమానులు కోరుతున్నారు.