Monday, August 4, 2025

10 నుంచి బండి ‘విజయసంకల్ప’ యాత్ర

కరీంనగర్ ఫిబ్రవరి 06 (నిఘా న్యూస్):- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు ఈ యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. మరోవైపు యాత్ర సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా యాత్ర చేసేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

తొలిరోజు సాగేదిలా…..

తొలిరోజు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నేగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర చేస్తారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనంపై వెళతారు. గ్రామాల్లో మాత్రం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. కరీంనగర్ లోని పద్మశాలి సంఘం భవన్ లో యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్నారెడ్డి, ప్రతాప రామక్రిష్ణతోపాటు పార్లమెంట్ ప్రభారీ మీసాల చంద్రయ్య, కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుసహా ఆయా జిల్లాల నుండి యాత్రకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంతో తెలంగాణలో బీజేపీ రూపురేఖలే మారిపోయాయని, అదే తరహాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టే యాత్రతో నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతుందన్నారు.ప్రజా సంగ్రామ యాత్ర చేసిన ప్రతి చోటు బీజేపీ బలపడిందని, ఓటింగ్ శాతం కూడా పెరిగిందని బండి సంజయ్ చెప్పారు. తాజాగా చేపట్టే యాత్రతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ రూపు రేఖలే మారిపోతాయని, రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాష్టంలో 11 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం తథ్యమని జాతీయ మీడియా, సర్వే సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular