కరీంనగర్, నిఘా న్యూస్: భారత ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక శక్తి..ఇది కేవలం వార్తల వాహకం కాదు…అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం..సమాజాన్ని దిశా నిర్ధేశం చేసే శక్తి,
ప్రజల బాధలను ప్రభుత్వానికి వినిపించే గళం..ఒకప్పుడు పత్రికలు ప్రజా స్వరం.కానీ నేటి పరిస్థితులలో కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి.గత దశాబ్దంలో జాతీయ మీడియా భారీ మార్పులను చూసింది.వాస్తవాలకు ప్రాధాన్యత తగ్గి టి.ఆర్.పి లు, సెన్సేషనలిజం, కార్పొరేట్/రాజకీయ ఒత్తిడులు పెరిగాయి.వాస్తవాలకు ప్రాధాన్యత తగ్గి టి.ఆర్.పి లు, సెన్సేషనలిజం, కార్పొరేట్/రాజకీయ ఒత్తిడులు పెరిగాయి. శబ్దం పెరిగింది.. సమాచారం తగ్గింది డిబేట్ షోలలో సమాచారం కంటే గొడవలు, ఆరోపణలు, డ్రామాతో నిండి ఉన్నాయి.కార్పొరేట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది..ఏ వార్త బలంగా వెళ్లాలి? ఏది మౌనం పాటించాలి? అన్నది చాలాసార్లు యజమాని ప్రయోజనాల ఆధారమే కనిపిస్తోంది. జాతీయ పత్రిక (స్వేచ్చ) దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం..
భారతీయ ప్రజాస్వామ్యంలో పత్రికారంగం ఒక శక్తి కాదు, ఒక బాధ్యత. ప్రజల గొంతుస్వరాన్ని పాలక వర్గాలకు వినిపించే వేదిక. అదే విలువలను గుర్తించుకునే రోజు జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఈ రోజు పత్రికా స్వాతంత్ర్యానికి చేసిన త్యాగాలను, నిబద్ధతను, నిజాయితీని స్మరించుకునే సందర్భం.పత్రికా రంగం ఉదయం వెలుగు రాకముందే తన పనిలో నిమగ్నమై ఉంటుంది. వార్తా విలేఖరులు అడుగు పెట్టని ప్రాంతం ఉండదు. ఎంత దూరం, ఎంత ప్రమాదం ఉన్నా ప్రజల కోసం సత్యం తీసుకురావడమే వారి ధ్యేయం. వరదల్లో, అగ్నిప్రమాదాల్లో, రాజకీయ ఉద్రిక్తతల్లో, ఏ విపత్తు వచ్చినా జర్నలిస్టులు పక్కకు తప్పుకొరు. ప్రజలకు తెలుసుకోవాల్సినది చెప్పడానికే వారు రాత్రింబవళ్లు శ్రమిస్తారు.
పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం మీడియా హక్కు కాదు; ప్రజల హక్కు. మీడియా బలహీనమైతే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అదే కారణంగా ఈ రోజు జరుపుకోవడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. సమాచార హక్కు, సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం, అవినీతి, అక్రమాలపై గళమెత్తడం — ఇవన్నీ పత్రికా స్వేచ్ఛ వల్లే సాధ్యం.ఈ సందర్భం విలేఖరుల మీద పెరుగుతున్న ఒత్తిళ్లను, బెదిరింపులను కూడా గుర్తు చేస్తుంది. అయినా వారు నిజం కోసం పోరాడుతూనే ఉంటారు. ఇదే పత్రికా ధర్మం, ఇదే ప్రజాస్వామ్య బలం.
జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మనందరికీ ఒక సందేశం ఇస్తుంది:
“సత్యం చెప్పాలి. సత్యం రాయాలి. సత్యమే ప్రజాస్వామ్యపు పునాది.”
ఈ రోజు పత్రికా రంగంలోని ప్రతి యోధుడికి మన వందనం. వారి కలం ప్రజలకు దారి చూపే దీపస్తంభం.


