కరీంనగర్ మున్సిపల్ పోరులో ప్రధాన పార్టీల మధ్య అవగాహనతో అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’
బీ-ఫామ్ ఎవరికి.. కార్యకర్తలా.. గెలుపు గుర్రాలా?
కరీంనగర్ మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు
కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ లోపాయికార ఒప్పందం కుదుర్చుకోగా…. బీజేపీ, బిఆర్ఎస్ ల మధ్య అండర్ స్టాండింగ్ తో టికెట్ల పంపకం జరుగుతుందనే ప్రచారం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు… శాశ్వత మిత్రులు లేరు… అవసరాన్ని బట్టి…. అనుకూల పరిస్థితులను బట్టి అందరూ ఒకటేనా రాజకీయాల్లో…?
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ పోరులో ప్రధాన పార్టీల మధ్య అవగాహనతో అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ కేటాయిస్తున్న తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ తో లో పాయికార ఒప్పందం కుదుర్చుకోగా…. బీజేపీ, బిఆర్ఎస్ ల మధ్య అండర్ స్టాండింగ్ తో టికెట్ల పంపకం జరుగుతుందనే ప్రచారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఈ రకమైన వ్యూహాత్మక ఎత్తుగడలను ఎంచుకున్నట్లు చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో బీ-ఫామ్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీ కోసం ఏళ్లుగా పని చేసిన కరుడుగట్టిన కార్యకర్తలకు ఇవ్వాలా? గెలుపు కోసం ధనబలం, జనబలం, కులాబలము ఉన్న అభ్యర్థులకు ఇవ్వాలా? అన్న విషయంపై నాయకత్వం సతమతమవుతోంది. ధనబలం ఉన్నవారికి బీ-ఫామ్ ఇస్తే గెలుపు సాధ్యమని పార్టీలు భావిస్తుండగా, కార్యకర్తలు మాత్రం తమను పక్కన పెడితే రెబల్స్ గా పోటీలో ఉంటామని చెబుతున్నారు.


