హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాజాసింగ్ ప్రకంపనలు
హైద్రాబాద్, నిఘా న్యూస్ : తెలంగాణ బీజేపీలో పెచ్చులూడిన విబేధాలకు మళ్లీ మారు పేరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు విరక్తిగా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందించగా.. ఆయనద్వారా హైకమాండ్‌కు చేరింది. దీంతో జూలై 11న పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
పార్టీలో అసంతృప్తికి గొంతు ఇచ్చిన రాజాసింగ్, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. “నాకే నామినేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నరు.. అంతే కాదు, పార్టీ ఆ అంతర్గత వ్యవహారాల్లో నన్ను పక్కన పెట్టారు” అంటూ గట్టిగానే ఫైర్ అయ్యారు. రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేయడాన్ని కూడా రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

“నాది పార్టీకి వ్యతిరేకత కాదు.. కానీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశలో లేవు” అంటూ ఎప్పటికప్పుడు సెటైర్లు, వ్యాఖ్యలతో హీట్ పెంచారు. ఎప్పుడో ఇచ్చిన రాజీనామా లేఖను ఇప్పుడు ఆమోదించడం ద్వారా బీజేపీ తన స్టాండ్‌ను స్పష్టంగా చూపించింది.
పార్టీ పరిపాట్లకు అనుగుణంగా లేని తీరుగా వ్యవహరించారన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.