హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ మూడు ప్రధాన పార్టీలు – భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – ఒక్కొక్కటీ “మాకు కనీసం 100 సీట్లు వస్తాయ్” అనే ధీమాతో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.
ఇక్కడ ప్రశ్నేంటంటే, ప్రజలు మాత్రం వీళ్ల మాటలు నమ్ముతున్నారా?
గాలిలో లెక్కలు ఈ మూడూ పార్టీలూ ప్రజల అభిప్రాయాలను కాకుండా, తమ స్వంత అంచనాలపై ఆధారపడుతూ గాలిలో లెక్కలు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. నిజంగా బీజేపీకి 100 సీట్లు వస్తాయా? గత ఎన్నికల్లో కేవలం 8 స్థానాలు గెలిచిన పార్టీకి ఇది సాధ్యమా? ఇదే ప్రశ్న కాంగ్రెస్ పట్లా, ఇటీవల భారీ పరాజయం చూసిన బీఆర్ఎస్ పట్లా కూడా వినిపిస్తోంది.
బీఆర్‌ఎస్ పది సంవత్సరాల పాలన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నెగటివ్ ఫీలింగ్‌తో ఉన్నప్పటికీ, మళ్లీ అదే ఉత్సాహంతో ‘మాకు 100+’ అంటూ ప్రచారం చేస్తోంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన అసంతృప్తి, అంతర్గత దుర్భలం ఇవన్నీ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తున్నాయి.
కాంగ్రెస్ ధీమా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మార్పు తీసుకొచ్చింది. కానీ ఒక్కసారి వచ్చిన విజయం ఆధారంగా మళ్లీ 100 సీట్లు వచ్చే నమ్మకం వారికి ఉంటే, అది ప్రజల అభిప్రాయంతో మిళితమైన అంచనా కాదు. ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యలపై స్పందన – ఇవే భవిష్యత్ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తాయి.
బీజేపీ మాత్రం హిందూత్వ రాజకీయాలతో, కేంద్రీయ నాయకత్వ బలంతో ముందుకెళ్తోంది. అయితే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీకి ఉండాల్సిన బలమేంటనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళది స్థానిక నాయకత్వం కంటే ఎక్కువగా ప్రచార ఆధారిత పార్టీగా మారుతోంది.
ఈ మూడు పార్టీలు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, స్వయంగా లెక్కలు వేసుకుంటూ “మాకు 100” అంటూ ప్రచారం చేయడం, ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవిశ్వాసం, రాజకీయ వ్యర్థ వాగ్దానాలు, ప్రజల బాధలను పట్టించుకోని పార్టీలు ఎన్ని లెక్కలు వేసుకున్నా ఓటరు ఓటింగ్ కంటె ముందే తీర్మానించతాడు.
ప్రజల ఆశల్ని నింపే పాలన, నిజాయితీగా వ్యవహరించే నాయకత్వం, ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉన్న పార్టీకి మాత్రమే 100 కాదు, దానికంటే ఎక్కువ సీట్లు రావచ్చు. కేవలం మాటలపై, ప్రచారాలపై ఓట్లు ఆశించడం కాకుండా, నమ్మకాన్ని నిర్మించాల్సిన అవసరం మూడూ పార్టీలకూ ఉంది.