జమ్మికుంట, (కలం నిఘా) : నిర్ణీత గడువులోగా రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ పమేలా సత్పత్తి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం, ఇల్లందకుంట రైతు వేదికల్లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు.ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగే వారన్నారు.
కేవలం కలెక్టర్ కే బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలే కపోయామని అన్నారు.ధరణి చట్టంలో ఉన్న 33 మాడ్యూల్స్ లో తమ సమస్య ఏం మాడ్యూల్ లోకి వస్తుందో తెలియక .. ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు.భూభారతి చట్టంలో తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కు అధికారాలు ఇవ్వడంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని వివరించారు.కొత్త చట్టంలో మనిషికి ఆధార్ మాదిరి భూమికి భూదార్ సంఖ్య కేటాయించినట్లు తెలిపారు. దీంతో భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.న్యాయ నిపుణులు, రెవెన్యూ ఉన్నతాధికారులు, రైతు సంఘం నాయకులతో సమావేశం నిర్వహించి భూభారతి చట్టం రూపొందించారన్నారు.ధరణి చట్టంలో కబ్జాదారు కాలమ్ అనుభవదారు కాలమ్ పక్కన పెట్టడంతో సమస్యలు తలెత్తాయని.. భూభారతి చట్టంలో మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయనున్నట్లు వివరించారు.
ప్రతి గ్రామంలో నాలుగు రకాల రికార్డులను నిర్వహిస్తారని.. ఏటా జరిగే భూమార్పుల రిజిస్టర్, చెరువులు, కుంటలు వంటి భూముల రిజిస్టర్, గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్ వంటి రికార్డులు నిర్వహిస్తారన్నారు.రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సమయంలో తప్పులు జరిగితే అప్పీలు చేసుకునే హక్కు రైతులకు కల్పించారని వివరించారు.రైతులెవరు ఆందోళన చెందవద్దని.. అందరి భూ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ సూచించారు. గతంలో దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ కు మాత్రమే ఉండేదని.. ఇటీవల ప్రభుత్వం డెలిగేషన్ ఆఫ్ పవర్స్ తీసేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే అధికారం తహసిల్దార్, ఆర్డిఓ లకు అప్పగించిందన్నారు. దీంతో జిల్లాలో ఉన్న భూ సమస్యలు 11 వేల నుంచి రెండు వేలకు తగ్గాయని పేర్కొన్నారు.
హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మాట్లాడుతూ.. భారతి చట్టంలో ఉన్న వివిధ సెక్షన్లను వివరించారు. ధరణి చట్టంలో తమ భూముల వివరాలను ఎవరికి కనిపించకుండా బ్లాక్ చేసే అధికారం రైతుకు ఉండేదని.. భూభారతి చట్టంలో బ్లాక్ చేసే అధికారం ఎత్తివేశారన్నారు. దీంతో రైతుల భూముల వివరాలు అందరికీ తెలుస్తాయని వివరించారు. మోకాపై వివాదాలు ఎత్తకుండా చట్టంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సదస్సుల్లో ఇల్లందకుంట తహసీల్దార్ రాణి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు