కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ప్రభుత్వ భూముల్లో కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొందరు అక్రమార్కలు ఈ భూములను ఆక్రమించి తమకు ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి క్రయ, విక్రయాలు లేకుండా ఈ భూములను ఆక్రమించుకొని అందులో ఇళ్లు నిర్మిస్తున్నారు.అంతేకాకుండా ఈ ఇంటికి నెంబర్లు కూడా కేటాయించారు. అయితే ఈ వ్యవహారం అంతా సాగడానికి మున్సిపల్ తో పాటు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వీరి అక్రమాలకు గత పోలీస్ కమిషన్ అడ్డుకట్ట వేశారు. అక్రమంగా ఇంటి నెంబర్లు తీసుకొని ఇళ్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకున్నారు. కొందరి ఇళ్లను నేలమట్టం చేయించారు. అయితే ప్రస్తుతం మిగతా వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కరీనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఒకప్పుుడు వేగంగా సాగాయి. అయితే ఈ నిర్మాణాలు ఎక్కువగా ప్రభుత్వ భూముల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో నిర్మాణాలు చేయడమే కాకుండా అక్రమంగా ఇంటి నెంబర్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై కొందరు ఫిర్యాదు లు చేయగా గత పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు. భూ కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేశారు. అయితే కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్న సమయంలో ప్రస్తుతం మున్సిపల్ అధికారులు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.
తాజాగా అక్రమంగా డోర నెంబర్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో డోర్ నెంబర్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ డోర్ నెంబర్లను జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందకుు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు చర్చ సాగుతోంది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.