కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోరు జోరుగా సాగుతోంది. ఈనెల 27న దీనికి సంబంధించిన ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ చేశారు. అభ్యర్థుల మాత్రమే కాకుండా ఆయా పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే వివిధ మాధ్యమాల ద్వారా అభ్యర్థులు ఓటర్లను ఓటు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా వారిని కలుసుకుంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.
వచ్చే మార్చికి రెండు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కావడంతో ఈనెల 27న రెండు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ పోరులో కాంగ్రెస్ తరుపున పుట్కూరి నరేందర్ రెడ్డి, బీజేపీ తరుపున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమమెల్సీ పోరులో బీజేపీ తరుపున ముల్క కొమురయ్య పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరుపున అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే పట్టభద్రుల నియోజకవర్గ పోరును పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ప్రచారంలో మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. బీజేపీ తరుపున బరిలో ఉన్న అభ్యర్థుల తరుపున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీలో ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరుపున రాష్ట్ర మంత్రులు ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్.. దేశంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమేనని అంటున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడో ఒక చోట సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల హమీలు ఇస్తున్నారు.
ఇదే సమయంలో రాజకీయ వేడి తీవ్రమవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీల మధ్య పోరు అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వాతావరణం వేడెక్కుతోంది. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. అటు రాష్ట్ర మంత్రులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న నరేందర్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కోవడంతో వాటిపై ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించి సమాధానం చెబుతున్నారు. ఇంకో వైపు బీజేపీ నాయకులు పట్టభద్రులను ఆకర్షించడానికి పలు రకాల హామీలు ఇస్తున్నారు.