ఆ నాలుగు జిల్లాల్లో బిజెపి ఎంపీలు..
కాంగ్రెస్ బిజెపి మధ్య ప్రధాన పోరు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిచేది ఎవరో?
కరీంనగర్, నిఘా న్యూస్ : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సంతరించుకుంది. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులుగా కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మరికొన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే గెలిపి ఎవరిది అన్న ధీమాలో కొందరు నాయకులు లెక్కలేసుకుంటున్నారు. బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును ప్రకటించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ తరపున అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరును ప్రకటించారు. అయితే టిఆర్ఎస్ తరఫున ఎవరు అనేది ఇంకా తేలలేదు. కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్ బిజెపి మధ్య ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గాలైన నాలుగు జిల్లాల్లో బిజెపి ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా వేస్తుందా అన్న చర్చ సాగుతోంది.
గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఇందులో ఉత్తర తెలంగాణలో కీలక జిల్లాలైన కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, అదిలాబాద్ ఎంపీగా గెడం నగేష్, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు బిజెపి తరఫున గెలిచారు. వీరు పార్టీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు. ఇందులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బిజెపి విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు.
అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితులను విడిచి పెట్టుకోవద్దని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్, ప్రముఖ నగరాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల పేర్లతో నరేందర్ రెడ్డి ప్రముఖంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన ద్వారా కాంగ్రెస్ గెలుచుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ బిజెపి నుంచి ఉన్న నలుగురు ఎంపీలు తమ అభ్యర్థి మీ గెలిపించుకోవడం సవాల్గా తీసుకున్నారు. ఒకవేళ బిజెపికి సీటు రాకపోతే నలుగురు ఎంపీగా ఉన్న జిల్లాల్లో క్యాడర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ సీటును గెలుచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో ఇక్కడ పార్టీ అని కాకుండా అభ్యర్థిని ప్రధానంగా ఎంచుకుంటారని అర్థమవుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం విద్యాసంస్థల ద్వారా గుర్తింపు పొందిన నరేందర్ రెడ్డి కి మద్దతు ఇస్తారా లేదా నాలుగు జిల్లాల్లో బిజెపి బలంగా ఉండడంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.