పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ డా. కడియం కావ్య ..
వరంగల్, నిఘా న్యూస్:భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన పోరాటంలో నిప్పుకణికగా నిలిచి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా హన్మకొండ హంటర్ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ …నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ అని తెలిపారు. దొరల దాష్టీకానికి ఎదురుతిరిగి తన పంట గింజలు రక్షించడమే కాకుండా, నాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ సాయుధ పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోరాట యోధురాలు చాకలి ఐలమ్మని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వీర వనితకు సమూచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద దేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.