Friday, February 27, 2026

జగిత్యాలలో డ్రగ్స్ కలకలం

ఓ విద్యార్థిని వింత ప్రవర్తనతో సంచలన నిజాలు వెలుగులోకి..
జగిత్యాల నిఘా న్యూస్: యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ని అంతమొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. డ్రగ్స్ వినియోగం అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. చివరికి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. మాయమాటలతో పిల్లలను డ్రగ్ రాకెట్‌లోకి లాగి, వారి చేత అసభ్యకరమైన పనులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటన తాజాగా జగిత్యాలలో వెలుగు చూసింది. ఓ తండ్రి చేసిన ఫిర్యాదుతో ఒళ్లు గగుర్పొడిచే ఈ డ్రగ్స్ బాగోతం బయటపడింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల నుంచి వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట్లో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా ఖాతరు చేయలేదు. అయితే.. ఈమధ్య అమ్మాయి మరింత విచిత్రంగా వ్యవహరిస్తుండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఎందుకిలా ప్రవర్తిస్తోందని ఆరాతీయగా.. ఆమె గంజాయికి అలవాటు పడిందని తండ్రికి తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ.. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అమ్మాయితో పాటు పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్థినులు సైతం మత్తుకు బానిసైనట్లు తేలింది. మొత్తం 10 మంది బాలికలు గంజాయికి బానిసైనట్లు తెలిసింది.

అసలు ఈ అమ్మాయిలకు ఎక్కడి నుంచి గంజాయి అందిందని మరింత లోతుగా విచారించగా.. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది. ఆ బాలికలను గంజాయికి బానిసలను చేయడమే కాదు.. వారిని హైదరాబాద్‌లోని రేవ్ పార్టీలకు కూడా తరలిస్తున్నట్టు వెల్లడైంది. అలా తరలించినందుకు గాను.. ప్రతి పార్టీకి రూ.30 వేలు ఆ ముఠాకు అందుతున్నట్టు తెలిసింది. ఈ తరుణంలోనే నార్కొటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. మత్తుకు బానిసైన విద్యార్థినులను స్వధార్ హోంకు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఈ పరిస్థితికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతున్నారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular