కరీంనగర్, నిఘా న్యూస్: విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి అందులో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపాలని మరియు వసతులు కల్పించాలని తద్వారా వారు అద్భుత విజయాలను నమోదు చేయడమే కాకుండ పోటీతత్వాన్ని అలవర్చుకుంటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వివిధ క్రీడల పోటీలలో పాల్గొని అద్భుతమైన విజయాలను సాధించి సమాజంలో ముందంజలో నిలవాలని వారు కోరారు. అందుకు అనుగుణంగా విద్యార్థులకు కళాశాలలో వివిధ క్రీడలలో నిష్ణాతులైన వ్యాయామ అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు తగిన ప్రోత్సాహాకాలను అందజేస్తు వారిలో పోటీతత్వాన్ని వెలికి తీస్తూ వివిధ పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన హన్మకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కళాశాలకు చెందినటువంటి నిఖిల్ సింగ్ సౌహాన్, జి. మనిచందు, సి.హెచ్. శ్రీధర్ రెడ్డి, పి. మణికంఠ మరియు యస్. ముఖేష్ లు అండర్ 19 బాలుర విభాగంలో ఎంపికైనారని హర్షం వ్యక్తం చేస్తూ విజేతలందరికి పుష్పగుచ్చాలతో పాటు అర్హత పత్రాలను అందజేసి జాతీయ స్థాయికి అర్హత సాధించి సంచలనాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అద్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.