కరీంనగర్, నిఘా న్యూస్: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు ప్రతినెల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులకు గురువారంనాడు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సర్వర్ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై పూర్తిస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించని యెడల సంభవించే ప్రమాదాల గురించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. కారులో ప్రయాణం చేసేపుడు సీటు బెల్టు ధరించడం యొక్క ప్రాముఖ్యత, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ఇప్పుడు హెల్మెట్ ధరించడంవల్ల ప్రాముఖ్యతలు తెలిపారు.

చిన్న పిల్లలు బస్సులో స్కూల్ కి ప్రయాణిస్తుంటారని బస్సు ఎక్కు మరియు దిగు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఉదాహరణలతో సహా వివరించామన్నారు. విద్యార్థులతోపాటు స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లకు సైతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించవచ్చు అన్నారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు నేర్చుకున్న విషయాలను ఇంట్లో పెద్దలకు తెలియజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకునే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కమిషనరేట్ వ్యాప్తంగా
నిరంతరం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రమేష్, కరీముల్లా ఖాన్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.